"ఈ ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు. ఎవళ్ల కోసం వాళ్లే చేసుకుంటారు. కొందరికది చాతనవుతుంది. కొందరికి అదీ రాదు"
(కాలాతీత వ్యక్తులు/డాక్టర్ పి. శ్రీదేవి)
జీవితం అన్ని సుఖాలను అనుభవించేందుకు, అపారమైన జ్ఞానాన్ని సముపార్జించేందుకు సరిపోకపోతే ఆ జీవితం మనకెందుకు?
(వ్యాసుడితో ద్రౌపది)
(ద్రౌపది/యార్లగడ్డ లక్ష్మీప్రసాద్)
గొప్ప రచయిత గోపీచంద్ (అసమర్ధుని జీవయాత్ర) 1952లో 'పేరంటాలు' సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు శ్రీశ్రీకి చూపించారు.
ఆ సినిమా చూసి శ్రీశ్రీ ఆశువుగా ఇలా చెప్పారట..
"చూచితిని పేరంటాలిని
వాచెను నా రెండు కళ్లు వలవలా ఏడ్వన్
లేచి లేవక మునుపే
గోచీ విడే నేమనందు గోపీచందు"
గణాచారి గుత్తా పన్ను:
విజయనగర రాజుల కాలంలో భోగపు సానులు పెద్దసంఖ్యలో ఉండేవారట. వారిపై విధించే పన్నును గణాచారి గుత్తా పన్ను అనేవారు. ఇలా వసూలు చేసే పన్ను 12 వేల మంది సైనికుల జీతభత్యాలకు సరిపోయేదట!
(ఆంధ్రుల సాంఘిక చరిత్ర/సురవరం ప్రతాపరెడ్డి)
"కాలం చాలా కఠోరమైనది. ఎంత వారినైనా తన పొట్టలో పెట్టుకుంటుంది. అదృష్టవంతుల పేర్లు పైకి వస్తాయి. దురదృష్టవంతులవి అట్టడుగున పడిపోతాయి"
(హంపీ నుంచి హరప్పా దాకా/
తిరుమల రామచంద్ర)
పరమాత్మను సర్వసాక్షి అంటారు. కానీ, అమాయకులకు, నేరం చేయని వారికి సాక్షిగా అతను ఎప్పుడైనా పరుగెత్తుకుని వస్తాడా?
(యయాతి/విష్ణు సఖారామ్ ఖండేకర్/యార్లగడ్డ లక్ష్మీప్రసాద్)
"ఇలా చేయకుండా ఉంటే, ఇలా కాకుండా ఉంటే బాగుండేది" అని నువ్వు విచారించేవన్నీ అప్పటికే ముగిసిపోయి ఉంటాయి
(ఫౌంటెన్ హెడ్/ అయిన్ రాండ్/ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు)
"ఎవరి సంభాషణ అయినా నాకు విసుగనిపిస్తే వాళ్ల నుంచి తప్పించుకోవడానికి నేను సాధారణంగా చేసే పని ఒకటుంది. అది- వాళ్లు చెబుతున్న దానికి ఒప్పుకున్నట్టు నటించడం.."
(The Stranger/అపరిచితుడు/
Albert Camu/జి. లక్ష్మి)
"చాలా కుటుంబాలు సంవత్సరాల తరబడి ఎలాంటి వికాసమూ లేకుండా ఉండటానికి కారణమేమిటంటే ఆ భార్యాభర్తలు పూర్తిగా కలిసీ ఉండరు, విడిపోయీ ఉండరు"
(ఆన్నా కరేనినా/టాల్ స్టాయ్/ తాపీ ధర్మారావు)
"రావణుడిలా జీవించాను. రావణుడిలా మరణిస్తాను. నాకు రాముడిలా మారాలని లేదు. అతను సంపూర్ణ మానవుడు. దేవుడు. నా రాజ్యంలో దేవుళ్లకు కొదవ లేదు. మనుషులే తక్కువైపోయారు"
(అసురుడు/ఆనందనీలకంఠన్/ఆర్.శాంతసుందరి)
ఇంటికొకసారి వచ్చిన తరువాత వెళతానని కూడా అనకుండా భోజనాలు చేస్తూ, విందులు కుడుస్తూ కూర్చునే అతిథిలాంటిది "అప్పు"
(గోదాన్/ ప్రేమ్ చంద్/ అట్లూరి పిచ్చేశ్వరరావు)
"లోకం ఎట్టుందిరా శిష్యా"
"లోకం ఎవుని లోకం వానిదిగా ఉంది సావి. ఇంత లోకం తిరిగి నేను తెల్సుకునింది ఇదొక్కటే"
(రాముడుండాడు రాజ్జివుండాది/ డాక్టర్ కేశవరెడ్డి)