జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణిక పత్రం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, ఆగస్టు 5: జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడతాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ నమోదు ప్రక్రియపై స్టాటిస్టికల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. శిక్షణ అనంతరం సేకరించిన సమాచారాన్ని సంబంధిత శాఖల ద్వారా ధృవీకరించి, జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ను అత్యంత విశ్వసనీయ పత్రంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో కె. మోహన్ కుమార్, రాష్ట్ర సెన్సస్ విభాగ సహాయ సంచాలకులు సుప్రజ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ లక్ష్మీకళ తదితరులు పాల్గొన్నారు.
యువతకు మై భారత్ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, IAS
చిత్తూరు:
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, IAS అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మై భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి కళాశాలల వరకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి యువతకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే వారికి సరైన అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి మై భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో 2026–27 సంవత్సరానికి మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. యువజన సాధికారత, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ శిక్షణలు, ఆరోగ్య అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ఈ సమావేశంలో జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, మై భారత్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జి.శ్రీనివాసులు, మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యుడు హరీష్ కల్వకుంట, వివిధ జిల్లా శాఖల అధికారులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.
కార్యక్రమంలో మై భారత్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
పూతలపట్టు, ఆగస్టు 4: ఐరాల మండలంలోని మొరంపల్లి గ్రామ ప్రాథమిక విద్యాశాఖ పాఠశాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు కె. మురళీమోహన్ పాల్గొని పాఠశాలను ప్రారంభించారు.
చిత్తూరు, ఆగస్టు 1: చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మసీదు మిట్ట గ్రామ సచివాలయ పరిధిలోని ఓటీ చెరువు, అలాగే 17వ వార్డులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద వివిధ సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం
పరిశ్రమల స్థాపనకు రాయితీలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, జూలై 29: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై విస్తృత అవగాహన కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పారిశ్రామికవేత్తలు తమ సమస్యలు, అవసరాలను https://t.co/wu8eXnJF9t పోర్టల్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి తెలియజేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమావేశంలో 23 ప్రోత్సాహక క్లెయిమ్‌లకు రూ.1.48 కోట్లు మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. జిల్లాలో అమలులో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, వాటి వేగవంతమైన అమలుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
రీ-సర్వే పనులను గడువులోగా పూర్తి చేయాలి
– జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు, జూలై 28: జిల్లాలో రీ-సర్వే పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తహసీల్దార్లను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీ-సర్వే పనుల్లో కృత్రిమ మేధ (AI) సాంకేతికతను వినియోగించి పనుల వేగం, పారదర్శకత పెంచాలని సూచించారు. పెండింగ్ కేసులు, ధ్రువీకరణ పత్రాల అప్లోడింగ్ను త్వరితగతిన పూర్తి చేసి, భూ వివాదాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనకు అధికారుల సామర్థ్య పెంపు కీలకం
– జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, జూలై 28: స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు జిల్లా స్థాయిలో అధికారుల సామర్థ్య పెంపు, డేటా ఆధారిత ప్రణాళికలు కీలకమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో పహల్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన సామర్థ్య పెంపుదల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2047 నాటికి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జిల్లా, మండల స్థాయిలో నాణ్యమైన గణాంకాల సేకరణ, విశ్లేషణ, స్థానిక వనరుల సమర్థ వినియోగం అత్యంత అవసరమన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన డేటాను సేకరించి, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాస్టర్ ట్రైనర్లను సన్మానించి, లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈవీఎంలు, వీవీప్యాట్ గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు, జూలై 28: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు నిర్వహించే నెలవారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ పరిశీలించారు
చిత్తూరు | 20-07-2026: చిత్తూరు కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె. మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో పారదర్శకత, సకాలంలో పంపిణీకి చర్యలు తీసుకోవాలి: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు, జూలై 14: ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో పారదర్శకత, సకాలంలో పంపిణీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
మంగళవారం జిల్లా సచివాలయంలోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎల్పీజీ సిలిండర్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లు సకాలంలో, పారదర్శకంగా అందేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
సిలిండర్ల సరఫరా, నిల్వలు, పంపిణీ విధానం, భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఎస్.ఓ సంబంధిత శాఖ అధికారులు, జిల్లాలోని ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు.
జిల్లాలో 99.95 శాతం ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తి
– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్, ఐఏఎస్
చిత్తూరు, జూలై 14: కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు వివరాల డిజిటలైజేషన్ 99.95 శాతం పూర్తైందని తెలిపారు.
మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 99.97 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, 99.92 శాతం ఫారాలు డిజిటలైజ్ చేశామని చెప్పారు. జిల్లాలో 1,511 మంది బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఓటర్ల వివరాల్లో మార్పులు అవసరమైన వారు "బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ" సేవను వినియోగించుకోవాలని సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డీఆర్ఓ కె. మోహన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి మామిడి రైతుకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, జూలై 14: కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ మామిడి పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రభుత్వ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ-క్రాప్ నమోదుతో పాటు భౌతిక పరిశీలన నిర్వహించి అర్హులను గుర్తించాలని, ఒక్క రైతు కూడా ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా చూడాలని సూచించారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మాదకద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్
చిత్తూరు, జూలై 13: జిల్లా సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. యువతలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
సమావేశం అనంతరం "డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు.
జూలై 14లోపు ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తి లక్ష్యం
– జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, జూలై 10: జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
జిల్లాలో మొత్తం 13,39,675 ఎన్యూమరేషన్ ఫారాలు (99.97%) పంపిణీ కాగా, 10,67,946 ఫారాలు (79.69%) డిజిటలైజేషన్ పూర్తయ్యిందన్నారు. జూలై 14లోపు డిజిటలైజేషన్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
జిల్లాలో ఇప్పటివరకు 36,205 మంది (2.70%) అన్‌కలెక్టబుల్ ఓటర్లను గుర్తించామని, తుది పరిశీలన అనంతరం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 1,511 మంది బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు.
జూలై 14న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి, జూలై 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు ECINET యాప్ లేదా https://t.co/Y1FSn0TyZUలోని "Book a Call with BLO" సేవను వినియోగించుకుని ఓటరు నమోదు, సవరణలు, వివరాల కోసం బీఎల్ఓలను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, బీఎల్ఓలు, రాజకీయ పార్టీలు, ప్రజల సహకారంతో SIR ప్రక్రియను గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.@AndhraPradeshCM
PMAGY పనుల పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు: జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో PMAGY కార్యక్రమం అమలుపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిల్లుల అప్లోడింగ్, పథకం కింద చేపట్టిన పనుల పురోగతి, లక్ష్యాల సాధన, నిధుల వినియోగం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే అప్లోడ్ చేసి, పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధించాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు, జూలై 8: ఆంధ్రప్రదేశ్ అమేచ్యూర్ కుస్తీ సంఘం ఆధ్వర్యంలో జూన్ 27, 28 తేదీలలో చిత్తూరు డీఎస్ఏ మైదానంలో నిర్వహించిన అండర్-23 బాలురు, బాలికల ఉమ్మడి జిల్లా కుస్తీ ఛాంపియన్‌షిప్‌లో చిత్తూరు జిల్లా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ పోటీల్లో రాకేష్, ఆర్. యశ్వంత్, ఎస్. అర్జున్, కె. ఎన్. హర్షిత, ఎస్. హరి, గురుప్రసాద్ బంగారు పతకాలు సాధించగా, ఎం. హరీష్, బిందుశ్రీ, ఆర్. మౌనిక వెండి పతకాలు సాధించారు. ఈ క్రీడాకారులు జూలై 9 నుంచి 11 వరకు హర్యానా రాష్ట్రంలోని రోహ్టక్లో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొననున్నారు.
అలాగే స్కూల్ అండర్-19 విభాగంలో డి. శరణ్య హర్యానాలో జరిగిన జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనగా, అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఎస్. మహాలక్ష్మి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ క్రీడాకారులను అభినందించి, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి. ఉదయ భాస్కర్, కుస్తీ కోచ్ రఫిక్ అహద్, నరహరిపేట పాఠశాల పీడీ రవి తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
పత్రికా ప్రకటన
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్
పూతలపట్టు, జూలై 7: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామంలోని బంధార్లపల్లి (పీఎస్-59), కర్ణంవారిపల్లి–పోటుగనుమ (పీఎస్-49), అలాగే ఐరాల మండలం పొలకలలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని వెంటనే డిజిటలైజ్ చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, సంబంధిత తహసీల్దార్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.