డీఎస్సీ 2025 పై ప్రభుత్వం స్పష్టమైన వివరణలు ఇచ్చినా కొందరు తప్పుడు ప్రచారం ఆపడం లేదు. మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన పోస్టులను పక్కదోవ పట్టించారనే తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. మెరిట్ లిస్టులు ఆన్ లైన్ లో డిలీట్ చేశారనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా లాంటివి జరగలేదని, ఆన్ లైన్ లో సమాచారం అంతా ఉందని అధికారులు చెప్పినా పట్టించుకోకుండా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటాపై గత రెండు మూడు రోజులుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేకాట బాగా వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది తప్పడు ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాన్ని వారు ఆపడం లేదు. వాస్తవానికి చూస్తే స్పోర్ట్స్ కోటా జాబితాను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయదు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు జారీ చేసిన జాబితాలో ఉన్న ఆటలలో ప్రావీణ్యం ఉన్న వారినే స్పోర్ట్స్ కోటా కింద పరిగణనలోకి తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో 'బ్రిడ్జ్' ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తింపు పొందింది. నిబంధనల ప్రకారం, స్పోర్ట్స్ కోటాలో కేటగిరీ-A మరియు కేటగిరీ-B విభాగాల కింద క్రీడలను గుర్తించి జాబితా రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక క్రీడా విభాగాల జాబితాలోనే 'బ్రిడ్జ్' ఉన్నందున, దానిని స్పోర్ట్స్ కోటాకు పరిగణనలోకి తీసుకోవడం అనేది నిబంధనలకు అనుగుణంగానే జరిగింది. అయితే ఈ కోటా కింద డిఎస్సీ 2025లో ఎవరూ రిక్రూట్ కాలేదు. కేంద్ర జాబితాలో ఉన్న అక్వాటిక్స్ (ఈత), ఆర్చరీ (విలువిద్య), అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ మరియు బాల్ బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్ (చదరంగం), క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జుడో, కబడ్డీ, కయాకింగ్ & కానోయింగ్, ఖో ఖో, పారా-అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్ (పారా స్పోర్ట్స్), పవర్‌లిఫ్టింగ్, రోలర్ స్కేటింగ్, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, ట్రయాథ్లాన్, వాలీబాల్ & బీచ్ వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగాసన నుంచి మాత్రమే డిఎస్సీలో రిక్రూట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలు జరిగాయని, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇవి నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న నిరాధారమైన ప్రచారం మాత్రమే. ప్రభుత్వ నియామక ప్రక్రియపై ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో అశాంతిని ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా, మీడియాపై చట్టపరమైన విచారణ చేపట్టి, ఐటీ చట్టం మరియు ఇతర నిబంధనల ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తాము.
#FactCheck
#AndhraPradesh
సోషల్ మీడియాలో 'మెగా DSC' నియామకాలకు సంబంధించి, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా జాబితాలో 'బ్రిడ్జ్' (Bridge) క్రీడను చేర్చడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు 'బ్రిడ్జ్' ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తింపు పొందింది. నిబంధనల ప్రకారం, స్పోర్ట్స్ కోటాలో కేటగిరీ-A మరియు కేటగిరీ-B విభాగాల కింద క్రీడలను గుర్తించి జాబితా రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక క్రీడా విభాగాల జాబితాలోనే 'బ్రిడ్జ్' ఉన్నందున, దానిని స్పోర్ట్స్ కోటాకు పరిగణనలోకి తీసుకోవడం అనేది నిబంధనలకు అనుగుణంగానే జరిగింది. ఈ నియామకాలలో అక్రమాలు జరిగాయని, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇవి నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న నిరాధారమైన ప్రచారాలు మాత్రమే. ప్రభుత్వ నియామక ప్రక్రియపై ఇలాంటి నిరాధారమైన మరియు తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో అశాంతిని ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా, మీడియాపై చట్టపరమైన విచారణ చేపట్టి, ఐటీ చట్టం మరియు ఇతర నిబంధనల ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తాము.
#FactCheck
#AndhraPradesh
మెగా డీఎస్సీ 2025 నిర్వహించి టీచర్లు గా అపాయింట్ అయి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు అసంబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తడం కేవలం ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం మాత్రమే. మెగా డీఎస్సీ 2025 పరీక్షలు Computer Based Test (CBT) విధానం లో నిర్వహించబడ్డాయి. అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 42 వేల ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రశ్న ఎవరికి వస్తుందో కూడా తెలియని విధానం లో కంప్యూటర్ నిర్ణయిస్తుంది. దేశవ్యాప్తంగా SSC, RRB, IBPS, NTA, GATE, CAT, APPSC, హైకోర్టు నియామకాలు తదితర ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహిస్తున్న TCS iON CBT మెగా డీఎస్సీ 2025 పరీక్షలు నిర్వహించింది. అయినా సరే ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం సవివరంగా ఖండన ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్లో అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ పై అపోహలు సృష్టించడం చట్టరీత్య నేరం. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిర్వహించిన డీఎస్సీ 2025 పై ఏడాది తర్వాత ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. చరిత్ర లో ఎప్పుడూ జరగని విధంగా మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత నుంచి న్యాయపరంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు కేసులు వేశారు. విద్యా శాఖ అన్ని వివరాలు కోర్టుకు సమర్పించగా అన్ని కేసుల్లో ప్రభుత్వ అనుకూల తీర్పులే వచ్చాయి. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం అమలు చేసిన హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా పోస్టు పొందలేని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడ నరసాపురం గ్రామానికి చెందిన వై శ్రవణ్ కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టు రాలేదని, అధికారులు సరియైన సమాధానం చెప్పలేదని సదరు వార్తా పత్రిక తప్పుడు ప్రచారం చేస్తున్నది. జిల్లా, రాష్ట్ర, అప్పిలేట్ స్థాయి గ్రీవెన్స్ సెల్ లలో వందలాది మందికి ప్రభుత్వం వివరణ లు ఇచ్చింది. కొందరు వివిధ స్థాయిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానాలు ఆదేశించిన విధంగానే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్య నేరం. దయచేసి ఇలాటి విషయాలను ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
న్యాయపరంగా అన్ని కేసులను పరిష్కరించుకోవడమే కాకుండా అభ్యర్థుల అనుమానాలు, సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా, రాష్ట్ర, అప్పిలేట్ స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఎంతో సమర్థంగా, చట్టబద్ధంగా డీఎస్సీ 2025 నిర్వహించిన అంశాన్ని కప్పిపెడుతూ తప్పుడు వార్తలతో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లు ఏడాది తర్వాత ఉద్దేశపూర్వకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నది. విశాఖ జిల్లా కు చెందిన బండారు యమున (68వ ర్యాంక్) విషయాన్ని తప్పుడు సమాచారం తో ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సుప్రీమ్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం అమలుచేస్తున్న హారిజాంటల్ రిజర్వేషన్లు ప్రకారం బండారు యమున కు ఉద్యోగం రాలేదు. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఆ పోస్టు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడం జరిగింది. ఈ వివరాలు అన్నీ అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది. కొందరు న్యాయస్థానాలకు వెళ్లగా అక్కడ ప్రభుత్వ వాదన వైపు తీర్పులు వచ్చాయి. చట్టబద్ధంగా జరిగిన నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం తగదు.
#FactCheck
#AndhraPradesh
పరీక్షలు నిర్వహించి, అర్హులను ఎంపికచేసి, వారికి నియామక పత్రాలు అందచేసి, వారు ఉద్యోగాలలో చేరి ఏడాది గడచిన తర్వాత ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు డీఎస్సీ 2025 పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నది. ప్రభుత్వం సవివరంగా ఖండన ఇచ్చిన తర్వాత కూడా వక్రభాష్యాలు చెబుతూ మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని దిన పత్రికలో ప్రచురించిన వార్త లో కడప జిల్లా వేంపల్లి కీ చెందిన షేక్ నసీమూన్ కు సర్టిఫికెట్ ల పరిశీలన జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదని పేర్కొన్నారు. సర్టిఫికెట్ ల పరిశీలన జరిగిన తర్వాత నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్పుడే వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తారు. దాని ప్రకారం ఎంపిక ఉంటుంది. బై మిస్టేక్ వల్ల మీకు కాల్ లెటర్ వచ్చింది అని అధికారులు చెప్పారు అంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. సుప్రీమ్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం అమలుచేస్తున్న వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు వల్లే ఆమెకు ఉద్యోగం రాలేదు. ఈ విషయాన్ని ఆ అభ్యర్థి కి స్పష్టం గా వివరించడం జరిగింది. చట్ట ప్రకారం జరిగిన నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
ప్రభుత్వం విద్యాకానుక కిట్ల పంపిణీని నిలిపివేసిందని 'cockroach_janasena_party' వంటి ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇదే విషయం పై గతం లో కొంతమంది ఫేక్ ప్రచారం చేయగా మే 24వ తేదీ న ప్రభుత్వ పరంగా పూర్తి వివరాలతో ఖండన ఇవ్వడం జరిగింది. ఐనా ఇప్పుడు ఫేక్ ఎకౌంట్ లతో మళ్ళీ జరుపుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. యుద్ధప్రభావం, అంతర్జాతీయ రవాణా అడ్డంకులు మరియు ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరుగుతోందే తప్ప పథకం ఎక్కడా నిలిపివేయలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి, మిగిలిన వస్తువులను తదుపరి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నాటికి అందజేస్తారు. విద్యార్థుల విద్యా పథకాలపై ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వారిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
#FactCheck
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) చేపట్టిన 'స్పోర్ట్స్ డీఎస్సీ-2025' నియామక ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించబడింది. క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం శాప్‌కు లేదు. అవి కేవలం సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా మాత్రమే జారీ చేయబడతాయి. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్‌ను, అది జారీ చేసిన సంస్థకు పంపి, అధికారికంగా జెన్యూనిటీ ధృవీకరించిన తర్వాతే మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ధృవీకరణ లేని ఏ సర్టిఫికెట్‌ను ఎంపిక ప్రక్రియలో ఉపయోగించలేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై 25.07.2025న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు FIR No.75/2025 (BNS సెక్షన్ 319(2), IT Act సెక్షన్ 66-D) నమోదు చేశారు. స్థానిక/స్థానికేతర స్థితికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. క్రీడా మెరిట్ ధృవీకరణ మాత్రమే శాప్ పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లు, రోస్టర్ అమలు మరియు పోస్టుల కేటాయింపులు పూర్తిగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం జరిగాయి. స్పోర్ట్స్ డీఎస్సీ-2025, శాప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తులు, మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు సహా కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము.
#FactCheck
#AndhraPradesh
ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం. అలాంటిదేం జరగలేదు. కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
#FactCheck#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలు. మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించడం జరిగింది. మల్టీ-సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యం. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదు.ఇక పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయబడిందని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ మరియు రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 22.08.2025న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు మరియు ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్సైట్లో విడుదల చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎటువంటి డేటా డిలీట్ కాలేదని, డిజిటల్ రికార్డులన్నీ మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు మరియు ఎంపికలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని, ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు మరియు ఇతర కోటాలకు 'హారిజాంటల్ రిజర్వేషన్' అమలు చేయడం వల్ల వారు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఎంపికయ్యారని వివరణ ఇచ్చింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్వయంగా ఇచ్చిన 'పోస్ట్ ప్రిఫరెన్స్' ఆధారంగానే ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోస్టుల కేటాయింపు జరిగిందని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్వీనర్ నియామకం కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు మరియు సేవా నిబంధనలకు అనుగుణంగానే అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంత పకడ్బందీగా జరిగిన మెగా డీఎస్సీ-2025 పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర’ కిట్లను పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం, షూ, బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అసలు వాస్తవాల్లోకి వెళితే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర కిట్లను నిలిపివేయలేదు. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫాం క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా కేవలం నెల రోజులు ఆలస్యమవుతుందని విద్యా శాఖ తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి. సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి అధికారులు తయారీ సంస్థలను సందర్శిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యా పథకాలపై ఇలాంటి అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో కూడిన ప్రచారాలు ప్రజల్లో అనవసర ఆందోళనలను కలిగిస్తాయి.
#FactCheck
#AndhraPradesh
అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. విమర్శకులు ఐకానిక్ సచివాలయ భవనాల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తూ, నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చెబుతున్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వివరాలు చూస్తే, జీఏడీ టవర్ (GAD Tower) అత్యంత ఎత్తైనది. ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 47 అంతస్తులతో (47 Floors) నిర్మితమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తున్న మిగిలిన 4 హెచ్‌వోడీ టవర్లు (HOD Towers) ఒక్కొక్కటి 39 అంతస్తుల (39 Floors) చొప్పున నిర్మించబడుతున్నాయి. వీటితో పాటు వాటి ముందు నిర్మించే విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం ₹17,339 మాత్రమే. అంతర్జాతీయ స్థాయి ప్రీమియం నిలువు నిర్మాణాలకు (Vertical Structures) ఈ రేటు పూర్తిగా ప్రామాణికమైనది.
ఈ ఖర్చు కేవలం సిమెంట్, ఇటుకల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఇది ఒక సంపూర్ణమైన ‘టర్న్‌కీ’ (Turnkey) ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే అత్యంత క్లిష్టమైన పునాదులు, సూపర్ స్ట్రక్చర్, అధునాతన మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (MEP) వ్యవస్థలు, గాలి వేగాన్ని తట్టుకునే హై-పర్ఫార్మెన్స్ ఎక్స్టీరియర్ ఫసాడ్స్, పూర్తిస్థాయి ఇంటీరియర్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, అంతర్గత మౌలిక వసతులు అన్నీ కలిసి ఉన్నాయి.
జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్‌ను 4 అంతస్తులతో నిర్మించారు. చదరపు అడుగుకు ₹16,916 ఖర్చయిన కేంద్ర పార్లమెంట్ భవనంతో పోలిస్తే, అమరావతి భవనాలు విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల భవనాలు) ఐకానిక్ టవర్లుగా నిర్మితమవుతున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు ₹17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని పనిగట్టుకొని కొందరు చేస్తున్న విమర్శలను నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
మీడియాలో, సోషల్ మీడియాలో కొందరు “అమరావతిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ₹189 కోట్లు ఖర్చు” అని ప్రచారం చేస్తున్నారు. అయితే, మౌలిక వసతుల సాంకేతిక వివరాలను పరిశీలిస్తే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం, తప్పుదారి పట్టించేదిగా ఉందని స్పష్టమవుతోంది.
నిజానికి అమరావతిలో నిర్మించిన ప్రధాన 6 లేన్ల రహదారుల సగటు ఖర్చు కిలోమీటర్‌కు దాదాపు ₹35 కోట్లు మాత్రమే. సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఇందులో అదనంగా నీటి సరఫరా పైపులు, భూగర్భ డ్రైనేజీ, కరెంట్, ఇంటర్నెట్ కేబుల్స్ కోసం ప్రత్యేక అండర్‌గ్రౌండ్ యుటిలిటీ డక్ట్, సైకిల్ ట్రాక్, రోడ్లకు ఇరువైపులా మరియు డివైడర్లలో మొక్కల ఏర్పాటు వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.
అలాగే కొండవీటి వాగు ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ వ్యయం ₹135 కోట్లు మాత్రమే. ఇది సాధారణ ఫ్లైఓవర్ కాదు. ఇందులో 3 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్‌తో పాటు క్లిష్టమైన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌లు, ఫ్లడ్ మేనేజ్మెంట్ నిర్మాణాలు ఉన్నాయి.
అమరావతి అనేది రైతులు ఇచ్చిన భూముల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న రాజధాని. కాబట్టి అలాంటి ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేయడం తగదు.
#FactCheck
#AndhraPradesh
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో గౌరవ ముఖ్యమంత్రి ప్రసాదం తీసుకోకుండా కేవలం తీసుకున్నట్లు నటించారని, ఆపై పక్కకు పెట్టేశారంటూ ఒక చిన్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. వైరల్ అవుతున్న వీడియో క్లిప్ సగం మాత్రమే కట్ చేసి, వక్రీకరించబడినది.
అసలు వీడియోను పూర్తిగా పరిశీలిస్తే అసలు వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయి. జాతర సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ముఖ్యమంత్రి గారు ఎంతో భక్తిప్రపత్తులతో, గౌరవపూర్వకంగా స్వీకరించిన పూర్తి విజువల్స్ ఒరిజినల్ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. పూర్తి వీడియో నుండి కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి, సందర్భాన్ని మార్చి చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు నెరేటివ్‌తో ఈ క్లిప్‌ను వైరల్ చేశారు. దేవుని సన్నిధిలో జరిగిన పవిత్రమైన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను ఎడిట్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పూర్తి వీడియో సాక్ష్యాల ప్రకారం ముఖ్యమంత్రి గారు ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. కాబట్టి ఇటువంటి మార్ఫింగ్ మరియు ఎడిటెడ్ వీడియోలను నమ్మవద్దని విజ్ఞప్తి. మార్ఫింగ్ మరియు ఎడిటెడ్ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
#FactCheck
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల అధ్యాపకుల నియామక నోటిఫికేషన్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ 'దివ్యాంగుల హక్కుల చట్టం 2016' మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల https://t.co/XoZpOiJipo.77, https://t.co/XoZpOiJipo.46 కు అనుగుణంగా దివ్యాంగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన 4% రిజర్వేషన్‌ను స్పష్టంగా పొందుపరిచారు. అధికారిక నోటిఫికేషన్లో దివ్యాంగులకు 4%తో పాటు మహిళలకు 33 1/3%, క్రీడాకారులకు 3%, మాజీ సైనికోద్యోగులకు 2% రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోంది.
#FactCheck
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు ప్రయాణ ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేస్తోందని, డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా తెస్తున్న ఈ-బస్సుల వల్ల ఈ పథకం కనుమరుగవుతుందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేయడం లేదు. గత 9 నెలల్లో మహిళలు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, దీనికి సంబంధించిన రూ. 2,350 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది మరియు ఇప్పటికే రూ. 720 కోట్లను ఆర్టీసీకి తిరిగి చెల్లించింది. ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ 60% నుండి 92% కి పెరిగి సంస్థ ఆదాయం కూడా మెరుగైంది. ఇందులో టికెట్ కొని ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా 40% గా ఉంది. ఆర్టీసీ బస్సులను ఎంచుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల సంఖ్య 39% తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి తేవటం కోసం కేంద్ర సహకారంతో 1,450 కొత్త ఈవీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తెస్తోంది. కొత్త బస్సుల రాక ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు అందించటం కోసమే, వైరల్ అవుతున్న రద్దు వార్తలు కేవలం అపోహలు మాత్రమే.
#FactCheck
#AndhraPradesh