మాజీ ముఖ్యమంత్రి @ysjagan జగన్మోహన్ రెడ్డి గారూ...
మీరు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల బాగోగుల విషయమై ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధ, మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళలో ఒక్కరోజైనా చూపించి ఉంటే బాగుండేది. బహుశా మీ పాలన గురించి మీరు మర్చిపోయినట్టున్నారు. అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచుతామని చెప్పి వారిని రోడ్డెక్కించిన మీ దగా చరిత్ర మర్చిపోయారా? హక్కుల కోసం ధర్నాకు దిగిన అంగన్వాడీలను మహిళలు అని కూడా చూడకుండా వారి పై లాఠీ చార్జీ చేయించింది మీరు కాదా? జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి మరీ అరెస్టులు చేయించింది మీరు కాదా? ఆ దారుణ ఘటనల్లో ఆ మహిళల వస్త్రాలు చెదిరినా సరే విడిచిపెట్టకుండా దుశ్శాసన పర్వం కొనసాగించిన కర్కశత్వం మీది కాదా? గట్టిగా మాట్లాడితే కక్షగట్టి అక్రమకేసులు పెట్టించిన మీరా వారి గురించి మాట్లాడుతున్నారు? ఆదాయపరిమితి పేరిట వారికి అందుతున్న సంక్షేమ పథకాల్లో కోత పెట్టినప్పుడు ఏమైంది ఈ ప్రేమ? మీ హయాంలో కొత్తగా కట్టిన అంగన్వాడీ కేంద్రాల సంగతి దేవుడెరుగు... కనీసం పాత కేంద్రాలకు తాగునీరు, టాయిలెట్ వంటి వసతులు కూడా కల్పించలేకపోయారు. అంగన్వాడీలు సమ్మెకు దిగితే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి వాటిని సచివాలయ సిబ్బందితో నిర్వహింపచేసిన నిరంకుశ పాలన చేసింది మీరు కాదా?
ఇక మీరు @ncbn చంద్రబాబుగారి ప్రభుత్వం గురించి మాట్లాడారు. 2014-19 మధ్య చంద్రబాబు గారి ప్రభుత్వం నెలకు రూ.4,200గా ఉన్న అంగన్వాడీ జీతాలను రూ.7,000 చేశారు. 2018లో మళ్ళీ రూ.10,500కు పెంచారు. 2019లో మళ్లీ పెంచి రూ.11,500గా చేశారు. అంటే ఐదేళ్లలో మూడు సార్లు అంగన్వాడీ వేతనాల్ని పెంచిన ఘనత చంద్రబాబుగారిదే. ఇది ఎవరూ మార్చలేని చరిత్ర జగన్ గారూ.
మీ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నాం. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5G స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసాం. ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే విధానం అమలు చేసి జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టాం. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, మరుగుదొడ్లు, ఆటవస్తువులు, వంటసామగ్రి వంటి మౌలిక వసతులతో పాటు... 15 రకాల ప్రత్యేక పోషకాహార పదార్థాలు మంజూరు చేసాం. మరణించిన సిబ్బందికి మట్టిఖర్చుల కోసం రూ.15,000 సాయం చేస్తున్నాం.
ముఖ్యంగా చెప్పేదేంటంటే అంగన్వాడీలు ప్రతిపాదించిన 10 డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించింది కూటమి ప్రభుత్వం. మీరు రాష్ట్రాన్ని దివాళా తీయించి ఉండకపోతే మిగిలిన ఆ ఒక్క డిమాండును కూడా నెరవేర్చి ఉండేవాళ్ళం. అయినప్పటికీ వెసులుబాటు చూసుకుని ఆ డిమాండును కూడా నెరవేరుస్తాం.
నేను అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు చెప్పేది ఒక్కటే. మీ వేతన భద్రత, గౌరవం, సంక్షేమం కోసం చంద్రబాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మిమ్మల్ని అగౌరవపరిచి, కష్టపెట్టిన వాళ్ళే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తమ రాజకీయ పబ్బం గడుపుకోడానికి ఏవేవో మాట్లాడతారు. ప్రభుత్వానికి మీకు మధ్య అగాధం, అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ప్రేరేపణలకు మీరు లొంగవద్దు. మీ సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేస్తోందని నేను హామీ ఇస్తున్నాను.