లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
బుధవారం #ఖమ్మంకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి పాల్గొని, పెండింగ్‌లో ఉన్న లేఔట్ అనుమతులపై సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్పిడిసిఎల్, టౌన్ ప్లానింగ్, తదితర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి లేఔట్ దరఖాస్తుకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి రిమార్క్స్, అభ్యంతరాలు, ఎన్ఓసీల స్థితిగతులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
లేఔట్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే సంబంధిత ఆన్లైన్ మంజూరు ప్రక్రియను మూడు రోజుల్లోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
లేఔట్ అనుమతులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా పరిశీలన, సంయుక్త తనిఖీలు నిర్వహించాలని, ప్రతిపాదిత లేఔట్ భూమి చెరువులు, నీటి వనరులు, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఇరిగేషన్, ఎన్పిడిసిఎల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖలు తమ పరిధిలోని అంశాలను పరిశీలించి అవసరమైన ఎన్ఓసీలు, నివేదికలను సకాలంలో అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
లేఔట్ కు అప్రోచ్ రోడ్డు, అంతర్గత రోడ్లు ఉండాలని అన్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి లేఔట్లో కేటాయింపులు జరిగేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
లేఔట్లో స్ట్రీట్ లైట్స్, సీవరేజ్ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. లేఔట్ ప్రాంతం నీటి వనరులు, నీటి ప్రవాహాలకు నిర్దేశించిన దూరంలో ఉండాలని, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు జారీ చేయరాదని స్పష్టం చేశారు.
లేఔట్ ప్రాంతంలో గతంలో ఏమైనా నీటి వనరులు, నీటి ప్రవాహ మార్గాలు ఉన్నాయా అనే అంశాన్ని సంబంధిత అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. లేఔట్ ఆమోద ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని తెలిపారు.
అనుమతులు మంజూరు చేసిన అనంతరం కూడా వాటిలో పేర్కొన్న నిబంధనలను లేఔట్ అభివృద్ధి సమయంలో పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి లేఔట్ దరఖాస్తుకు సంబంధించి సంబంధిత శాఖల నివేదికలకు స్పష్టమైన కాలపరిమితి విధించి, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కమిటీలో 23 లే ఔట్ లకు సంబంధించి దరఖాస్తులను పరిశీలించారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న కాలంలో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంట సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు.
బుధవారం #సత్తుపల్లి మండలం అయ్యగారిపేట గ్రామంలో పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన జిల్లా కలెక్టర్, వరి నార్లు పోస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, రానున్న రోజుల్లో సాగునీటి అవసరాలపై అవగాహన కల్పించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని చూసి భవిష్యత్తులో కూడా సమృద్ధిగా నీరు ఉంటుందని రైతులు భావించి వరి సాగు చేపట్టడం సరైన నిర్ణయం కాదని కలెక్టర్ తెలిపారు. వరి పంటకు నాట్ల దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పలుమార్లు నీరు అందించాల్సి ఉంటుందని, వర్షాలు అనుకూలించకపోతే చివరి దశలో సాగునీటి కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీరు, చెరువులు, కుంటలు, బీరుబావుల నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో వాటి ద్వారా నిరంతరంగా నీటిని అందించడం సాధ్యం కాకపోవచ్చని తెలిపారు. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు, పశువులు, అవసరమైన నీటి లభ్యతను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గతంలో అనుకూల వాతావరణ పరిస్థితులు, అనూహ్యంగా కురిసిన వర్షాల వల్ల పంటలు చేతికి వచ్చిన సందర్భాలు ఉన్నాయని, అయితే ప్రతిసారీ అలాంటి పరిస్థితులు ఉంటాయని భావించి సాగు నిర్ణయాలు తీసుకోవద్దని రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, గత అనుభవాల ఆధారంగా మాత్రమే భవిష్యత్తును అంచనా వేయడం సరికాదన్నారు.
నీటి కొరత ఏర్పడే అవకాశం ముందుగానే తెలిసినప్పుడు రైతులు అప్రమత్తమై తగిన నిర్ణయాలు తీసుకోవాలని, అధిక పెట్టుబడులు పెట్టిన తర్వాత పంటకు నీరు అందక నష్టపోయే పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు.
వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో ఎంపిక చేసుకోవాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందస్తుగా క్షేత్రస్థాయికి వచ్చి ఈ విషయాలను వివరిస్తున్నామని తెలిపారు.
రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ నష్టభయం లేని సాగు విధానాలను అనుసరించాలని రైతులను జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
#ఖమ్మంజిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాలకు చెందిన ధాన్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లతో సత్తుపల్లి మిల్ పాయింట్ వద్ద జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ఏమాత్రం తగ్గకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 2,481 తో పాటు, ప్రభుత్వం అందించే బోనస్ రూ. 500 కలిపి మొత్తం రూ. 2,981 చెల్లించాలన్నారు. దొడ్డురకం ధాన్యానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,461 చెల్లించాలనీ తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని, వీలైతే రైతులకు అండగా నిలుస్తూ మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యాపారులు, మిల్లర్లకు సూచించారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రైతులను నష్టపరిచే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరించారు. రైతులు కూడా తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధర లేదా అంతకంటే ఎక్కువ చెల్లించే వ్యాపారులకే విక్రయించాలని విజ్ఞప్తి చేశారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
ఈరోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సర్వే శాఖ అధికారులతో భూ సమగ్ర రీసర్వే, హౌసింగ్ కు సంబంధించిన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగింది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు, రెండు రోవర్లను సమకూర్చుతున్నాం. ప్రస్తుతం 708 రోవర్లతో సర్వే కొనసాగుతోంది, మరో వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను అందుబాటులోకి తీసుకువస్తాము. పాలేరును పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, నియోజకవర్గ పరిధిలోని మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నాం.
రెవెన్యూ, ఫారెస్ట్ భూముల విషయంలో ఇరు శాఖల అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిహద్దులను నిర్ధారించాలని ఆదేశించాను. రీసర్వే నిర్వహణలో నల్గొండ, ఖమ్మం జిల్లా కలెక్టర్ల పనితీరు అభినందనీయం. నిజామాబాద్ జిల్లాలో రీసర్వే జరుగుతున్న పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించాను.
అదేవిధంగా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హనుమకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను తక్షణమే గుర్తించి, సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలి. దీంతో పాటు 2బీహెచ్‌కే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి, 22ఎ భూముల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించాను.
@TelanganaCMO
#LandResurvey #Telangana
రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. #ఖమ్మంకలెక్టరేట్ నుండి #జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
భూముల రీసర్వే ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఉమ్మడి జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అంశాలపై సమీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.
రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు గ్రౌండ్ రిపోర్టులను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. రీసర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, లోపాలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. రీసర్వే ఎస్ఓపీని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. భూముల రీసర్వేకు సంబంధించి రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ)ను అధికారులు పక్కాగా అమలు చేయాలని మంత్రి సూచించారు.
క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు, సవరణలు చేపట్టాలని తెలిపారు. కేవలం ఉన్నతాధికారులను సంతృప్తిపరిచే నివేదికలు కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు ఉండాలని స్పష్టం చేశారు.
రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.
రీసర్వే జరిగే సమయంలో సంబంధిత గ్రామాల రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, స్థానిక రైతుల సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు.
సర్వే నివేదికల పై అభ్యంతరాలు ఎలా సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి, ఏ విధంగా పరిష్కరించబడతాయి అనే అంశాలపై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే వివరాలను ప్రజలకు తెలియజేస్తూ దండోరా వేయించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు.
ప్రజలకు రీసర్వే వివరాలు పూర్తిస్థాయిలో తెలియజేయాలని, వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే వివరాలు, రికార్డులు కచ్చితత్వంతో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
రీసర్వేలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా, రీసర్వే ప్రక్రియను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో #జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ, జిల్లాలో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటివరకు 18 రెవెన్యూ గ్రామాల్లో షేప్ ఫైల్స్ పూర్తి కాగా, 23,519 ఎల్‌పిఎంల పరిధిలోని 31,399 ఎకరాలకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 14 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు.
సర్వే సందర్భంగా విస్తీర్ణం తగ్గినా లేదా పెరిగినా, అక్కడ కూర్చుని ప్రాపర్ రెవెన్యూ విచారణ పూర్తి చేసి సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సివిల్ కోర్టు కేసులు లేదా తీవ్ర వివాదాలు ఉంటే తప్ప, మిగిలిన భూ సమస్యలన్నింటినీ పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు అన్నారు. భూ సర్వే వేగంగా, పారదర్శకంగా జరిగేలా చూడటానికి సర్వేకు ముందే గ్రామంలో రైతులకు జెండాలు పంపిణీ చేస్తున్నామని, రైతులు తమ భూమి సరిహద్దుల్లో జెండాలను పాతడం వల్ల పొరుగు రైతులతో ముందే అవగాహన కుదిరి, చిన్న చిన్న వివాదాలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయనీ వివరించారు. ఎల్‌ఆర్‌యుపి సమయం నాటి వ్యత్యాసాలు, సక్సెస్షన్ (వారసత్వ) కేసులు, పాత సాదా బైనామాలు, రికార్డుల్లో లోపాలపై ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ ఆర్డర్ల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో లక్ష్యం మేరకు రిసర్వే ప్రక్రియ పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
రాజకీయ పార్టీల పూర్తి భాగస్వామ్యం, సమన్వయంతోనే పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీ సాధ్యమవుతుందని #జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. బుధవారం #ఖమ్మంకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమగ్ర ఓటర్ల సవరణ (SIR-2026), పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, ముసాయిదా ఓటర్ల జాబితాలో నివాసంలో లేనివారు, స్థలం మారినవారు, మృతి చెందినవారు, నకిలీ/రెండోసారి నమోదైన ఓటర్ల పేరుతో ఏఎస్ డిడి కేటగిరీ కింద తొలగించిన ఓటర్లకు తుది జాబితాలో పేరు చేర్చుకోవడానికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు.
#ఖమ్మంజిల్లా లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి వ్యాప్తంగా మొత్తం 1,57,854 మందిని ఏఎస్ డిడి కేటగిరీ కింద గుర్తించినట్లు తెలిపారు. ఇందులో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారినవారు 1,01,549 మంది, మరణించినవారు 33,380 మంది, ఇతర నియోజకవర్గాల్లో ముందే ఓటు నమోదు పొందినవారు 11,004 మంది, గైర్హాజరైనవారు 11,371 మంది ఉన్నారన్నారు. వీరందరికీ సవరణ ప్రక్రియ కింద నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు జారీ చేసిన 1,75,840 నోటీసులలో 1,75,753 నోటీసులను పంపిణీ చేసి విచారణ నిర్వహించినట్లు స్పష్టం చేశారు. నోటీసుల విచారణ ప్రక్రియను నవంబర్ 26 నాటికి పూర్తి చేసి, నవంబర్ 30న ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.
తొలగించబడిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో, సీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారమ్ ద్వారా తమ ప్రస్తుత నివాస పరిధిలోని ఈఆర్ఓ/ ఏఈఆర్ఓ/బిఎల్ఓ లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు (ఫారమ్-18) పురోగతిపై కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 6 నాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,09,942 ఫారమ్-18 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో ఇప్పటివరకు 52,163 దరఖాస్తులను ఆమోదించామని, 2,353 దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించామని, మిగిలిన 55,426 దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ఈఆర్ఓ/ ఏఈఆర్ఓ/బిఎల్ఓల స్థాయిలో వేగవంతంగా జరుగుతోందని తెలిపారు.
నవంబర్ 20 నాటికి డ్రాఫ్ట్ రోల్ తయారీ పూర్తి చేసి, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, డిసెంబర్ 30న ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా విడుదలవుతుందని అన్నారు.
మధ్యలో పెండింగ్‌లో ఉన్న కొత్త ఓటరు నమోదు (ఫారమ్-6), ఆక్షేపణలు (ఫారమ్-7), మార్పులు/చేర్పులు (ఫారమ్-8) దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నిబంధనల మేరకు నూతన పోలింగ్ కేంద్ర ఏర్పాట్లకు ప్రతిపాదనలు చేసినట్లు, ఇట్టి ప్రతిపాదనలపై అభ్యంతరాలు వుంటే వ్రాతపూర్వకంగా శనివారం లోగా తెలపాలని కలెక్టర్ అన్నారు. రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్లను చురుగ్గా భాగస్వాములను చేసి, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి విడిపోకుండా సహకరించాలని కలెక్టర్ కోరారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఖచ్చితమైన రికార్డులను రూపొందించడం కోసం చేపట్టిన భూ రీ-సర్వేకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమే ప్రామాణికమని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
#ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి రెవెన్యూ గ్రామంలో పొలం కాల్వగట్ల పై ద్విచక్ర వాహనం లో ప్రయాణించి కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, భూ యజమానుల సమక్షంలో రోవర్, ట్యాబ్ తదితర ఆధునిక సాంకేతిక పరికరాలతో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న విధానం, ఇప్పటివరకు పూర్తయిన, మిగిలిన ప్రక్రియ పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కలెక్టర్ రైతులతో నేరుగా మాట్లాడుతూ, భూ రీ-సర్వే ఉద్దేశ్యం, సర్వే నిర్వహణ విధానం, భూ రికార్డుల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతులు అడిగిన సందేహాలు, అనుమానాలను తెలుసుకుని వాటిని నివృత్తి చేశారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి అంశాన్ని రైతుల సమక్షంలో పరిశీలించి, వాస్తవాలను మాత్రమే నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ*, భూమి ఉండి పట్టాదారు పాస్‌బుక్‌లు లేని వారు, పట్టాదారు పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోని భూ విస్తీర్ణం, హద్దులు, ఇతర వివరాలు రికార్డులతో సరిపోని వారు, అలాగే రికార్డుల్లో భూమి వివరాలు నమోదు కాని సందర్భాలను రీ-సర్వే ద్వారా గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
భూమి హద్దుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు తలెత్తకుండా రీ-సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రీ-సర్వేలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎవరు భూమిని సాగు చేస్తున్నారు, వారి పేరుపై ఎంత విస్తీర్ణం నమోదై ఉంది, పట్టాదారు పాస్‌బుక్ ఉందా లేదా, రికార్డుల్లో నమోదైన వివరాలు క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోతున్నాయా అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విస్తీర్ణానికి మధ్య తేడా ఉంటే, చుట్టుపక్కల రైతుల సమక్షంలో కొలతలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని అన్నారు. అవసరమైన సందర్భాల్లో పంచనామా నిర్వహించి వివరాలను నమోదు చేయాలని అన్నారు.
సర్వే సందర్భంగా సంబంధిత భూ యజమానికి వివరాలను తెలియజేసి, నిబంధనల ప్రకారం వారి సమ్మతిని నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్‌లు, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.
సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా రూపొందించడం, ఆధార్, మొబైల్ నంబర్ తదితర అవసరమైన వివరాలను నమోదు చేయడం వంటి ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి భూమికి సంబంధించిన వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు.
ఏ ఒక్క అర్హుడి భూమి వివరాలు కూడా రీ-సర్వేలో తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. రికార్డుల్లోని వివరాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను సాంకేతికంగా పరిశీలించి, మ్యాప్‌లు, సర్వే నంబర్లు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేస్తూ భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా పక్కా రికార్డులను రూపొందించాలని సూచించారు.
అధునాతన రోవర్, ట్యాబ్ తదితర సర్వే పరికరాలను సమర్థవంతంగా వినియోగించి ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. అర్హులైన భూ యజమానులు, సాగుదారులకు భూ హక్కులపై స్పష్టత కల్పించే విధంగా రీ-సర్వేను పారదర్శకంగా పూర్తి చేసి, అర్హులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందేలా భూ రికార్డులను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.
రీ-సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండి, తమ వద్ద ఉన్న సంబంధిత భూ పత్రాలను అధికారులకు అందజేస్తూ సర్వే ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. రైతుల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించే రీ-సర్వే ద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలను తగ్గించి, భూ రికార్డుల్లో మరింత స్పష్టత తీసుకురావచ్చని కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
#ఖమ్మం నగరపాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని వెలుగుమట్ల మోడల్ కాలనీలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు అన్ని రకాల మౌళిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని #జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ అధికారులను ఆదేశించారు. వెలుగుమట్ల మోడల్ కాలనీని క్షేత్రస్థాయిలో సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
వెలుగుమట్ల మోడల్ కాలనీలో మొత్తం 300 ఇళ్లకు మంజూరు ఇవ్వడం జరిగిందని, క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ప్రకారం ఇప్పటికే 22 ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా అయ్యి, తుది దశకు చేరగా, 119 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు. అలాగే 59 ఇళ్లు రూఫ్ లెవల్, 98 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని, మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని అన్నారు.
లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఇళ్ల నిర్మాణ స్టేజీని బట్టి ప్రతి సోమవారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న 205 ఇళ్లకు సంబంధించిన పేమెంట్లు పూర్తయ్యాయని, మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇళ్ల నిర్మాణ వేగాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 133 మంది లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించామని తెలిపారు.
కాలనీ వాసులకు అవసరమైన ఆరోగ్య, విద్యా సదుపాయాలు కల్పించడంలో భాగంగా నిర్మిస్తున్న బస్తీ దవాఖానా, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ప్రస్తుతం కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి అన్ని పనులనూ పూర్తి చేసి, కాలనీని మోడల్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలలో ఎలాంటి రాజీ పడకూడదని, ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
#ఖమ్మంజిల్లా లో వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్ల ను యథాస్థితిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందజేతకు చర్యలు చేపట్టాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పలు మండలాల్లోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో 30, సింగిరెడ్డిపాలెం గ్రామంలో 48, శంకరగిరి తండా గ్రామంలో 30, కూసుమంచి మండలం మల్లెపల్లి గ్రామంలో 16, ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురంలో 192 అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల నిర్మాణాలను ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అదే స్థాయి నుంచి పూర్తి చేసుకునేందుకు అంగీకారంతో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించవలసిందిగా అధికారులకు సూచించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తిగా పారదర్శకమైన విధానాన్ని అవలంబించాలని తెలిపారు. ఇళ్ల సముదాయాల వద్ద విద్యుత్, శానిటరీ, త్రాగునీటి సరఫరా తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
#ఖమ్మం నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం #ఖమ్మంకలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో ఖేలో ఇండియా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఖేలో ఇండియా జాతీయస్థాయి ఆర్చరీ పోటీల నిర్వహణపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయస్థాయి పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు, సహాయక సిబ్బంది, సాంకేతిక నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
పోటీ కోసం మొత్తం 134 మంది జిల్లాకు వస్తున్నారని ఇందులో 64 మంది క్రీడాకారులు, 20 మంది సహాయక సిబ్బంది, 20 మంది సాంకేతిక సిబ్బంది, 24 మంది క్రీడా వాలంటీర్లు, ఇతరులు ఉంటారని తెలిపారు. వీరికి అవసరమైన వసతి సదుపాయాల కోసం చెక్‌లిస్ట్ ప్రకారం మొత్తం 74 గదులను ముందస్తుగా బుక్ చేయాలని ఆదేశించారు.
క్రీడాకారులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 22 వాహనాలను ఏర్పాటు చేయాలని, వాహనాలు, హోటళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
స్టేడియంలో, ప్రతి హోటల్లో త్రాగునీరు, పారిశుధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి హోటల్‌కు ఒక లైజన్ అధికారిని నియమించి, సంబంధిత హోటల్ యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పోటీలు జరిగే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి చేరుకునే రహదారులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ఇతర మౌళిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. క్రీడా శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పోటీల సమయంలో క్రీడాకారులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, సమీప ఆసుపత్రుల్లో అవసరమైన పడకలను ముందుగానే రిజర్వ్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
మధిర నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొన్నారు.
ఎర్రుపాలెం మండలం బంజారలో రెడ్డి బోయిన నాగమణి-కృష్ణయ్య, పెద్ద గోపవరంలో మోదుగు సీతారాజ్యం-గోపి, మధిర మండలం దెందుకూరులో ముప్పసాని కృష్ణవేణి-రాంబాబు దంపతుల ఇళ్లల్లో, మల్లారంలో యంద్రాతి అచ్చారావు, బోనకల్ మండలం రాయణపేటలో పర్సగానీ గోపి, చింతకాని మండలం పొద్దుటూరులో రెళ్ళ రాసి-తిరుపతి రావు, ముదిగొండ మండలం వనం వారి కిష్టాపురంలో పి.గంగా భవాని-శ్రీహరి, ముదిగొండలో కె.శ్రీలత-రాజేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో స్థానిక ప్రజలతో కలిసి ఉప ముఖ్యమంత్రి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ఆనందంగా పండుగ ఉప ముఖ్యమంత్రి జరుపుకున్నారు. ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరడంతో ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటనలో ఆయా గ్రామాల ప్రజలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉప ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. నేడు గ్రామ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొని పండుగను లబ్ధిదారులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టడం ఒక వరమని, పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి అందిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ కోర్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు.
ఇప్పటివరకు మంజూరైన ఇళ్లలో 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 1.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఎంత వేగంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తే అంతే వేగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని సొంతింటిలో గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు.
ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పారదర్శకంగా నేరుగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు.
పేదలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం లోని ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ఈ పథకం ఉపయోగ పడుతుందని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకం క్రింద 71 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల నిధులు అందిస్తున్నామని, ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించడంలో భాగంగా బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.90 వరకు ఉన్నప్పటికీ, రేషన్ దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, అంతర్జాతీయ ప్రమాణాలతో 105 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా ఆనందం, వెలుగులు నిండాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti