https://t.co/qcwYm7e7MZ
శ్రీ గురుభ్యో నమః
2018 ఫిబ్రవరి లో రాజమహేంద్రవరం నగరంలో అత్యంత వైభవంగా జరిగిన 42 రోజుల శ్రీమద్భాగవత ప్రవచన యజ్ఞం ఇవాళ్టి నుండి YouTube లో ప్రసారం కానుంది.
ఈ క్రింద నున్న ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని రోజు తప్పకుండా వినగలరు.
https://t.co/gaua1KrFhu
భారతీయ విద్యలలో యోగశాస్త్రం చాలా ప్రధానమైనటువంటిది.
యోగం అనేది భారతదేశం నుంచి వచ్చింది అనేది ఎంత వాస్తవమో వేదాలలోంచి వచ్చింది అనేది కూడా అంత కఠినమైనటువంటి సత్యం.
హిందూధర్మం నుంచి యోగాను వేరు చేయాలని చూడడం అజ్ఞానం.
విశ్వజనీనమైన యోగా ఒక మతానికి చెందినదిగా చూడకూడదు అంటూ ఉంటారు చాలామంది. కానీ విశ్వజనీనమైన యోగాన్ని అందించిన మతం హిందూమతం గనుక హిందూమతం కూడా విశ్వజనీనమైనదే అని తెలుసుకోగలగాలి.
ప్రపంచం మొత్తం మీద మొదటి మానవ సాహిత్యం ఋగ్వేదం అని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.
పతంజలి చెప్పిన యోగశాస్త్రమే ప్రపంచానికి ఇప్పుడు శిరోధార్యం. ఆ పతంజలికి హిందూధర్మం శిరోధార్యం.
ఉపనిషత్తులలో, వేదాలలో చెప్పబదినదే యోగం.
భారతీయుల ఆధ్యాత్మిక సాధన అంతా యోగమే.
యోగాన్ని ప్రపంచంలో ఇతరులు తలకెత్తుకుంటున్న ఈ దశలో ఇది మనది అని మనం మర్చిపోతే తిరిగి వాళ్ళదిగా మనకి వాళ్ళే నేర్పే దుస్థితి ఏర్పడుతుంది గనుక హిందువు మేల్కొని యోగా పూర్తిగా హైందవమని గ్రహించి ఆ యోగమార్గంలో మనం తరించి ఇతరులకు మార్గదర్శకంగా నిలబడదాం
ఋషిప్రోక్తం
అతిథి దేవునిగా అగుగాక!
అతిథిదేవోభవ - యజుర్వేదం
(సప్తగిరి మాసపత్రికలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు)
అతిథిని దేవునిగా భావించి గౌరవించడం మన సంప్రదాయం. లౌకికమైన ఒక మర్యాదగానో, సాటి మనిషిని మంచి చేసుకొనే ఒక ప్రక్రియగానో అతిథిసేవను మనం పరిగణించము. అతిథిని దైవంగా భావించి, అతిథి తృప్తి చెందితే దేవతలు ఆనందిస్తారనే భావనతో సేవించుకుంటాం.
తనంత తానుగా అనుకోకుండా వచ్చిన అతిథితో పాటు, ఆహ్వానించిన వ్యక్తి కూడా గౌరవనీయుడే. తాను, తన కుటుంబ సభ్యులే కాక అతిథి అభ్యాగతులతో కలిసి భోజనం చేసే ఇల్లే ఇల్లని మన ప్రాచీనుల భావన. అతిథులు రాని ఇల్లు ఇల్లే కాదు. 'వచ్చీపోయే అతిథులతో ఇల్లు కళకళ లాడాలి' అని గృహిణీ గృహస్థులు కోరుకుంటారు. అతిథి రాని రోజున భోజనం చేయని వ్రతనిష్టులైన గృహస్థులు కూడా ఉండేవారు (ప్రస్తుత కాలంలో కూడా అక్కడక్కడా ఉండవచ్చు).
ఒకరికి వండిపెట్టడంలో విసుగు, శ్రమ చూపించకుండా గృహిణీ గృహస్థులు ఆనందంగా, ఉత్సాహంగా కృషిచేసేవారు. శ్రద్ధగా, భక్తిగా అతిథికి భోజనం పెట్టి సేవచేసే భాగ్యమిచ్చినందుకు అతిథికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి దీవెనలందుకొనే భవ్యసంస్కృతి మనది.
తమకు తాము కూడా విసుగ్గా వండుకొనే ఈ రోజుల్లో, అతిథి అభ్యాగతులు రాకుండా ఉంటేనే మేలు- అనుకొనే దుఃస్థితిలో చాలామంది ఉన్నారు. దేవతలకి నివేదించి, అతిథులకు ఆరగింపు చేసి, తరువాత భుజించడం అనే అందమైన ఆనవాయితీని ఇప్పుడు పోగొట్టుకున్నాం. రోజూ కాకున్నా, తరచు అతిథి అభ్యాగతులకు భోజనం ఏర్పాటుచేసే సంప్రదాయాన్ని అలవరచుకోవడం ఇంటికి శ్రేయస్సు.
అతిథికి నిలువ నీడ, భోజనం, వస్త్రం ఇచ్చి సత్కరించితే భగవంతుని ఆరాధించినట్లే. పూర్వపు రోజుల్లో శుచిని, ఆచారాన్ని పాటించే శోత్రియులు, అటువంటి ఆచార సంపన్నుడైన గృహస్థు ఇంటికే వెళ్ళేవారు. ఆ గృహస్థు సంతోషంగా ఆచార శుద్ధి కలిగిన ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు. అలాంటి మంచి సంస్కృతి నేడు కరువౌతోంది.
అతిథి అర్ధరాత్రి వచ్చినా విసుక్కోకుండా అన్నం పెట్టే అన్నపూర్ణమ్మలు భారతీయ గృహిణులు అని నాటి సాహిత్యం అభివర్ణించింది. 'అభ్యాగతః స్వయం విష్ణుః' అని సంభావించే ఉత్తమసంస్కారం మన ప్రాచీనులది.
దేవతారాధన, పితృతర్పణం, శాస్త్రాధ్యయనం- దేవ, పితృ, ఋషిఋణాలను తీర్చుకొనే సాధనాలు. అతిథిసేవ మనుష్యయజ్ఞం. దీనివలన దేవతలు, పితరులు, ఋషులు సంతోషిస్తారు. వసిష్ఠుడు మొదలైన మహాత్ములు అరణ్యవాసం చేస్తున్నా తమ తపోబలంతో చక్రవర్తులకు సైతం వారికుచితమైన మృష్టాన్న భోజనాలను ఏర్పాటు చేసి అతిథిసేవా ధర్మాన్ని చాటి చెప్పారు.
ఒక భిల్ల దంపతులు తమ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టి, రాత్రివేళ అతడికి ఆశ్రయమిచ్చేందుకై, తమ చిన్న ఇంటిని ఏర్పాటు చేసి తాము ఆ అడవిలో బయట నిద్రించారు. ఆ సమయంలో రాత్రి వేళ అటు వచ్చిన సింహం వారిని చంపి తిని వేసింది. త్యాగపూర్వకంగా, అతిథిని దైవంగా భావించి చేసిన ఈ అపూర్వ సేవకు పరమేశ్వరుడు సంతోషించాడు. ఆ భిల్ల దంపతులే తరువాతి జన్మలో నలదమయంతులుగా పుట్టి అపూర్వ చక్రవర్తి దంపతులుగా భోగాలను, యశస్సును ఆర్జించారు. వారికి అనుసంధానకర్తగా ఆ శివుడే హంసగా అవతరించాడు. (శివపురాణగాథ)
ఒక కపోత దంపతులు తమ గూడు ఉన్న చెట్టును ఆశ్రయించిన బోయవాని కోసం తమను తాము సమర్పించుకుని సద్గతిని పొందిన కథను భారతం చెబుతోంది. ఇలా అతిథి సేవాధర్మములను పురాణేతిహాసాలు చాలా తెలియజేశాయి.